ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సాంకేతికతతో నీటి సంరక్షణకు ‘ప్రాజెక్ట్ పానీ’



 స్మార్ట్ గ్రీన్‌హౌస్ ద్వారా వ్యవసాయంలో ఏఐ, సెన్సార్ల వినియోగంపై అవగాహన

 ప్రజాపక్షం/కూసుమంచి :  నీటి సంరక్షణతో పాటు వ్యవసాయాన్ని మరింత స్మార్ట్‌గా, సుస్థిరంగా మార్చేందుకు సాంకేతికతను వినియోగించడమే ‘ప్రాజెక్ట్ పానీ’ ముఖ్య ఉద్దేశమని హైదరాబాద్‌లోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) విద్యార్థి (పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మనవడు చిన్న కుమార్తె కొడుకు అయినా ) సుధీని దక్ష్ తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయం, పాలేరులో శనివారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రాజెక్ట్ వివరాలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా సుధీని దక్ష్ మాట్లాడుతూ.. స్మార్ట్ టెక్నాలజీలపై ఆసక్తితో గతంలో స్మార్ట్ ఇరిగేషన్‌పై పరిశోధన చేసినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పానీలో భాగంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ గ్రీన్‌హౌస్ వ్యవసాయం, సాంకేతికత, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఒకే వేదికపై నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు. త్వరలో మరిన్ని అధునాతన వ్యవసాయ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సెన్సార్ల ద్వారా నేలలోని తేమ, ఉష్ణోగ్రత వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించవచ్చన్నారు. సెన్సార్లు ఎలా పనిచేస్తాయి, వాటి నుంచి డేటాను ఎలా సేకరించాలి, సేకరించిన సమాచారాన్ని వ్యవసాయంలో ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వివిధ రకాల నేలలు, నేల తేమ, ఉష్ణోగ్రత మొక్కల పెరుగుదలపై చూపే ప్రభావం, సేంద్రియ ఎరువుల ప్రాధాన్యం, వివిధ వ్యవసాయ పద్ధతుల ప్రభావాన్ని విద్యార్థులు తెలుసుకునేలా ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు వివరించారు. సెన్సార్ల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించి, అర్థం చేసుకునే నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొక్కలకు అవసరమైన సమయంలోనే నీరు అందించేలా, నిర్ణీత సమయానికి నీరు పెట్టే సంప్రదాయ పద్ధతికి బదులుగా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా నీటి వృథాను తగ్గించి, వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా మార్చవచ్చన్నారు. డేటా సేకరణ, విశ్లేషణ, కోడింగ్, ఏఐ మోడళ్ల నిర్మాణం, సమస్యల పరిష్కారం వంటి నైపుణ్యాలు భవిష్యత్తులో రైతులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్ సైంటిస్టులుగా ఎదగడానికి ఉపయోగపడతాయని తెలిపారు. గ్రీన్‌హౌస్‌లో పండించే ఆహారాన్ని పాఠశాల మధ్యాహ్న భోజన కార్యక్రమానికి వినియోగించనున్నట్లు చెప్పారు. సుస్థిరతను కేవలం చదువుకోవడమే కాకుండా ఆచరణలోనూ చూపించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయం పాలేరు ప్రిన్సిపాల్ వెంకట రమణ, వివేకానంద ఇనిస్టిట్యూట్‌కు చెందిన వాసుదేవ్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్‌కు ప్రోత్సాహం అందించిన ప్రిన్సిపాల్, వాసుదేవ్‌కు సుధీని దక్ష్ కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది