మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
ఎం. వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మంచి అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని తీసుకొచ్చిందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో త్వరలోనే పాలేరు నియోజకవర్గంలో కూడా ఈ పథకం అందుబాటులోకి రానుందని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డికి పాఠశాల విద్యార్థులు సంగీత వాయిద్యాలతో, పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. అనంతరం దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... పేద కుటుంబాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐఐటీ కోచింగ్ సెంటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అందుబాటులో ఉన్న విద్యా అవకాశాల గురించి తెలుసుకుని వాటిని వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే 22 మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలలోనూ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు గతంలో సైకిళ్లు అందించామని, ఈ ఏడాది కూడా అర్హులైన విద్యార్థులను గుర్తించి సైకిళ్లు అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు లేని విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారికి పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా రెసిడెన్షియల్ కాలేజీల్లో విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పరంగా, వ్యక్తిగతంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధిపై మాట్లాడుతూ... గత రెండేళ్లలో ఎం. వెంకటాయపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయని, రాబోయే రెండేళ్లలో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో అవసరమైన సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యార్థినితో రిబ్బన్ కటింగ్ చేయించిన : దయాకర్‌రెడ్డి
ఈ సందర్భంగా విద్యార్థినితో రిబ్బన్ కటింగ్ చేయించి దయాకర్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకునేందుకు దయాకర్ రెడ్డి చూపిన చొరవ పట్ల అక్కడికి వచ్చిన పార్టీ నాయకులతో పాటు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆయన చేసిన ప్రయత్నం పలువురి ప్రశంసలు అందుకుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి