నిబద్ధతకు దక్కిన అరుదైన గుర్తింపు
ఖమ్మం రూరల్ మండల ఏఐఎస్ఎఫ్‌కు గౌరవంగా నిలిచిన ఎదుగుదల
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : కమ్యూనిస్టు పార్టీలో పదవి అంటే కేవలం హోదా కాదు... అది ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యత. కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టే అవకాశం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేసే వారికి లభించే గుర్తింపు. అలాంటి బాధ్యతను ఓ యువకుడు అందుకోవడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, క్రమశిక్షణ, ఉద్యమ నిబద్ధత దాగి ఉంటుంది. ఆ మార్గంలో తనను తాను నిరూపించుకున్న ముత్తగూడెం గ్రామానికి చెందిన బూర మనోజ్ తాజాగా ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై తన నాయకత్వ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అధిగమించారు.
జిల్లా కార్యదర్శిగా ఎన్నిక
ఈ నెల 19న ఖమ్మం పట్టణంలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ 27వ జిల్లా మహాసభల్లో బూర మనోజ్‌ను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఖమ్మం రూరల్ మండల పరిధి నుంచి విద్యార్థి ఉద్యమంలో ఎదిగి జిల్లా స్థాయి బాధ్యతను చేపట్టడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
విద్యార్థి సమస్యలపై రాజీలేని పోరాటం
జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా బూర మనోజ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు.విద్యారంగంలో కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు.
పదవి వచ్చిందన్న సంతోషం కంటే... అప్పగించిన బాధ్యతకు న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మనోజ్ ప్రస్థానం విద్యార్థి ఉద్యమంలో ఎదగాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి