ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మద్దులపల్లిలో ఉమ్మడి కుటుంబం



 

ఖమ్మం రూరల్ మండలంలో ఆదర్శంగా నిలుస్తున్న అంబటి కుటుంబ ఐక్యత

వృత్తులు వేరైనా సంపాదన ఉమ్మడే

రోజు 50 మందికి ఒకే ఇంట్లో భోజనం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఒకప్పుడు ఇంటి పెద్దల మాటకు విలువ.. అన్నదమ్ముల మధ్య ఆప్యాయత.. అందరూ కలిసి భోజనం.. కష్టమొస్తే ఒకరికి ఒకరు అండగా నిలవడం.. ఇవన్నీ ఉమ్మడి కుటుంబానికి ప్రతీకలుగా కనిపించేవి. కాలం మారుతున్న కొద్దీ ఆ అనుబంధాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. చిన్న కుటుంబాలే నేటి జీవన విధానంగా మారుతున్న తరుణంలో.. అన్నదమ్ములు, వారి కుటుంబాలు, పిల్లలు, జీతగాళ్లు కలిసి ఒకే ఇంట్లో ఐక్యంగా జీవిస్తూ అలనాటి ఉమ్మడి కుటుంబ సంప్రదాయానికి అద్దం పడుతోంది మద్దులపల్లిలోని 'కుటుంబం అన్నగారి' అంబటి కుటుంబం.

ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో అంబటి సుబ్బారావు కుటుంబం నేటి తరానికి ఉమ్మడి కుటుంబ బాంధవ్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. సంపాదన, ఆస్తులు, బాధ్యతలు, సుఖదుఃఖాలు అన్నింటినీ కలిసే పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారి ఐక్యతను చూస్తే ఒకప్పుడు విస్తారంగా కనిపించిన ఉమ్మడి కుటుంబ జీవనం కళ్లముందు ప్రత్యక్షమవుతున్నట్లుగా ఉంటుంది.


రోజూ 50 మంది కలిసి భోజనం..


ఉమ్మడి కుటుంబం అంటేనే పెద్ద కుటుంబం. మరి అంబటి కుటుంబంలో ప్రతిరోజూ జరిగే భోజన ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో పనిచేసే జీతగాళ్లు కలుపుకొని ప్రతిరోజూ సుమారు 50 మంది వరకు కలిసి భోజనం చేస్తారు. జీతగాళ్లకు జీతం చెల్లించి పని చేయించుకోవడం సాధారణమే అయినప్పటికీ.. వారిని కూడా కుటుంబంలో ఒక భాగంగా భావిస్తూ ఆప్యాయతతో చూసుకోవడం ఈ కుటుంబ ప్రత్యేకత. పని కోసం వచ్చిన వారు అనే భావనకు బదులుగా.. తమతో కలిసి భోజనం చేసే మనుషులుగా వారిని చూడటం కుటుంబ సభ్యుల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక పండగలు, కుటుంబంలో వేడుకలైతే ఇక ఊరంతా పండుగే అని చెప్పాలి.


ఎవరు సంపాదించినా.. ఉమ్మడి ఆస్తే..


ఈ కుటుంబ ఐక్యత కేవలం కలిసి ఉండటానికే పరిమితం కాదు. ఎవరు సంపాదించినా అది కుటుంబ సంపదగానే భావించడం ఈ కుటుంబంలో కొనసాగుతున్న సంప్రదాయం. ఇంట్లోని నిత్యావసర సరుకులు, వస్తువుల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, భూములు, ఇతర ఆస్తుల వరకు అన్నీ ఉమ్మడిగానే ఉంటాయి. కుటుంబంలో పెద్దన్నగా అంబటి సుబ్బారావు అన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా అండగా నిలుస్తున్నారు. సుబ్బారావు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటుండగా.. ఒక తమ్ముడు రైస్ మిల్లును నిర్వహిస్తున్నారు. మరో తమ్ముడు వ్యవసాయాన్ని చూసుకుంటున్నారు. అన్నదమ్ముల మధ్య పరస్పర అవగాహనతో పాటు వారి భార్యల మధ్య కూడా ఇంతవరకు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఒకే కుటుంబంగా కొనసాగుతుండటం విశేషం.


ఐక్యతే వారి బలం..


నేటి కాలంలో ఆస్తులు, సంపాదన, కుటుంబ బాధ్యతల విషయంలో చిన్న చిన్న విభేదాలకే కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో అంబటి కుటుంబం మాత్రం కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాటను ఆచరణలో చూపిస్తోంది. తరాలు మారినా కుటుంబ బంధాలు మారకూడదని, సంపాదన కంటే అనుబంధాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చాటి చెబుతోంది. అందుకే మద్దులపల్లిలోని అంబటి కుటుంబం కేవలం ఒక ఉమ్మడి కుటుంబంగానే కాకుండా.. కుటుంబ బంధాలకు, అన్నదమ్ముల ఐక్యతకు, పరస్పర ఆప్యాయతకు ఒక చిరునామాగా నిలుస్తోంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم