ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఓఎస్ఎఫ్‌ రుణంతో ఉపాధి బాట



 

మహిళా సంఘాల యూనిట్లపై కేంద్ర బృందం పరిశీలన


ప్రజాపక్షం /నేలకొండపల్లి: రుణం తీసుకుని సొంతంగా యూనిట్‌ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న మహిళా సంఘాల సభ్యుల ప్రగతిని తెలుసుకునేందుకు కేంద్ర బృందం నేలకొండపల్లి మండలంలో పర్యటించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐఆర్డీ)లో శిక్షణ పొందుతున్న త్రిపుర, నాగాలాండ్‌, మహారాష్ట్ర, అస్సాం, మిజోరం రాష్ట్రాలకు చెందిన 32 మంది అధికారులు వివిధ యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రుణాల వినియోగం, వ్యాపార నిర్వహణ, ఆదాయం, ఉపాధి కల్పనపై సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని సహస్ర కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌ కేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించింది. వన్‌ స్టాప్‌ ఫెసిలిటీ (ఓఎస్ఎఫ్‌) ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకుని యూనిట్‌ను ఏర్పాటు చేసిన నిర్వాహకురాలు మరికంటి ఉమారాణితో బృందం సభ్యులు మాట్లాడారు. రుణం ఏ విధంగా తీసుకున్నారు..? దానిని ఏ అవసరాలకు వినియోగించారు..? యంత్రాల కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారు..? ప్రస్తుతం యూనిట్‌ ద్వారా ఎంత ఆదాయం వస్తోంది..? ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు..? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూనిట్‌ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌, మార్కెటింగ్‌ విధానం, భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై కూడా నిర్వాహకురాలితో చర్చించారు. ఓఎస్ఎఫ్‌ ద్వారా అందిన రుణంతో ఏర్పాటు చేసిన యూనిట్‌ ద్వారా పొందుతున్న ప్రయోజనాలను బృందం పరిశీలించింది. మహిళా సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న వివిధ రకాల ఎంటర్‌ప్రైజెస్‌ను కేంద్ర బృందం సందర్శించింది. ఫంక్షన్లు, వివాహ కార్యక్రమాలకు అవసరమైన సౌండ్‌ సిస్టం, డెకరేషన్‌ యూనిట్‌, బోటిక్‌, కర్రీ పాయింట్‌, హోటల్‌, హెర్బల్‌ ప్రొడక్ట్స్‌, స్కిన్‌కేర్‌ తదితర యూనిట్ల నిర్వహణ తీరును పరిశీలించింది. యూనిట్లకు పెట్టుబడి ఎలా సమకూరింది.. రుణాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు.. వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ఎంత.. ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు.. వంటి అంశాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేలకొండపల్లి మండల కేంద్రంలోని మదర్‌ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో సమాఖ్య ప్రతినిధులతో కేంద్ర బృందం సమావేశమైంది. మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాలు, సంఘ సభ్యులకు అందుతున్న ఆర్థిక సహకారం, తీసుకున్న రుణాలు, వాటి వినియోగం, రుణాలతో ఏర్పాటు చేసిన ఉపాధి మార్గాలు, సభ్యులకు కలుగుతున్న లబ్ధి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, స్వయం ఉపాధి యూనిట్ల నిర్వహణ, రుణాల సద్వినియోగం తదితర అంశాలపై సమాఖ్య ప్రతినిధులతో బృందం చర్చించింది. క్షేత్రస్థాయిలో యూనిట్లను పరిశీలించడం ద్వారా మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలపై ప్రత్యక్ష అవగాహన పొందినట్లు అధికారులు తెలిపారు. క్షేత్ర పర్యటనలో భాగంగా కేంద్ర బృందం భక్తరామదాసు ధ్యాన మందిరం, బౌద్ధ క్షేత్రాన్ని కూడా సందర్శించింది. ఆయా ప్రాంతాల విశిష్టత, చారిత్రక నేపథ్యం గురించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాము, ఐకేపీ డీపీఎం శ్రీనివాస్‌, నేలకొండపల్లి ఏపీఎం సురేంద్ర బాబు,సిసిలు పెద్దపాక వేంకటేశ్వరరావు, పెరుగు మల్లయ్య, బీడీఎస్పీలు మల్లెబోయిన పుష్ప,కట్టేకోల లావణ్య, గ్రామ దీపికల సంఘం ప్రతినిధి రాజపుత్ర పార్వతీబాయి, మండల సమాఖ్య ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم