సర్పంచ్ బండి సతీష్, ఉపసర్పంచ్ షేక్ దావూద్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని ఆరంపుల గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామంలో జరిగే హిందూ, ముస్లిం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పరస్పరం పాల్గొంటూ సోదరభావాన్ని చాటుకుంటున్నారు. దర్గాకు హిందువులు భక్తితో వెళ్లడంతో పాటు, వినాయక చవితి తదితర హిందూ పండుగల్లో ముస్లింలు సైతం పాల్గొంటూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ టెంపుల్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బండి సతీష్, ఉపసర్పంచ్ షేక్ దావూద్ ముఖ్య అతిథులుగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం వారితో పాటు కమిటీ సభ్యులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మత సామరస్యం, పరస్పర సోదరభావం మరింత బలపడాలని పలువురు ఆకాంక్షించారు. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి పండుగలను నిర్వహించుకోవడం ఆరంపుల గ్రామ ప్రత్యేకతగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బండి భాస్కరరావు, బండి వెంకటేశ్వర్లు, బొడ్డు వెంకటేశ్వర్లు, షేక్ జానీమియా, మోత్కూరు శ్రీనివాసరావుతో పాటు హనుమాన్ టెంపుల్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి