ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా 'యువ' సాఫ్ట్‌వేర్ ఉద్యోగి



 


 

అమ్మ కౌన్సిలర్‌గా.. నాన్న కాంగ్రెస్ నాయకుడిగా ప్రజాసేవ.. కొడుకు యువజన విభాగంలో పార్టీ బలోపేతానికి కృషి

యువతతో మమేకమవుతు రాజకీయాల్లో తనదైన యువ ముద్ర


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: చేతిలో లాప్టాప్.. కళ్ళ ముందు మంచి కెరీర్ కానీ మనసంతా ప్రజాసేవ వైపు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. మంచి విద్యార్హత.. భవిష్యత్తుపై ఎన్నో అవకాశాలు.. అయినా ప్రజలతో మమేకమై రాజకీయాల్లో అడుగులు వేస్తున్నాడు ఓ యువకుడు. ఆధునిక ఉద్యోగ జీవితంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ తనదైన పాత్ర పోషిస్తూ యువతకు ప్రతినిధిగా నిలుస్తున్నాడు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అవసరమనే మాటలకు ఆచరణ రూపం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు బోయిన సాయి. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు బోయిన సంగయ్య, కౌన్సిలర్ బోయిన కుమారి దంపతుల కుమారుడు సాయి. 28 ఏళ్ల వయసులోనే రాజకీయాలపై ఆసక్తితో ముందుకు సాగుతున్న ఆయన ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉద్యోగ జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలు, స్థానిక రాజకీయాలు, యువతకు సంబంధించిన అంశాలపై ఆసక్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.


తండ్రి-తల్లి అడుగుజాడల్లోనే.. ప్రజాసేవ వైపు


సాయి రాజకీయ ఆసక్తికి కుటుంబ నేపథ్యం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. తల్లి బోయిన కుమారి కౌన్సిలర్‌గా ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండగా, తండ్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజాసేవను దగ్గరగా చూస్తూ పెరిగిన సాయి కూడా ప్రజా జీవితంపై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి బోయిన సంగయ్య కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లో కొనసాగుతుండటంతో చిన్ననాటి నుంచే రాజకీయ వాతావరణాన్ని పరిచయం చేసుకున్నాడు.


యువతతో మమేకమవుతూ..


కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ఆసక్తితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యే తీరు, రాజకీయ కార్యక్రమాల పట్ల సాయి ఆకర్షితుడయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో స్థానిక యువతతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. సాంకేతిక రంగంలో పనిచేస్తున్న యువకుడిగా ఆధునిక ఆలోచనలను రాజకీయాలతో అనుసంధానం చేస్తూ ముందుకు సాగుతున్న సాయి.. యువత రాజకీయాల్లోకి రావాలనే చర్చకు తన ప్రయాణం ద్వారా ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఉద్యోగం చేసుకుంటూనే ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఈ యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భవిష్యత్తులో రాజకీయంగా మరింత చురుగ్గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు స్థానికులు.


దయాకర్ రెడ్డి చొరవతో ముందుకు


మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు వారసుడిగా, నిత్యం పాలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి ఆశీస్సులు సైతం సాయికి మెండుగా ఉండడం విశేషం. ఓ పక్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క దయాకర్ రెడ్డి ఆశీస్సులతో పాటు రాజకీయాలపై అవగాహన పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న యువ నాయకుడు సాయి ఇప్పటికే తనదైన రాజకీయ వ్యూహాలను మొదలుపెట్టారు. తాజాగా సీపీఎం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు కీలకంగా వ్యవహరించడం ఆయన రాజకీయ యువ చతురతకు నిదర్శనంగా నిలిచింది. స్థానికంగా యువతను, వివిధ వర్గాల నాయకులను కలుపుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సాయి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనే చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది