ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కె. శంకరయ్యతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్‌పై బహిరంగంగా మరణాన్ని కోరుతూ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సంబంధిత వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, బానోతు కృష్ణ , ముర్రిమేకల నాగేశ్వరరావు, పేరం వెంకటేశ్వర్లు, జరుపుల లక్ష్మణ్ నాయక్, గుడిబోయిన దర్గయ్య, ముత్యం కృష్ణారావు, మట్ట వెంకటేశ్వరరావు, రెడ్యా నాయక్, కృష్ణా నాయక్, వెంపటి ఉపేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి