పంటకు జీవం పోసిన వర్షం
చెరువులు, కుంటల్లోకి చేరుతున్న నీరు
రైతుల్లో పెరిగిన ఆశలు
ప్రజాపక్షం / నేలకొండపల్లి: వర్షం కోసం ఎదురుచూస్తున్న వరి రైతులకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఎండలతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న పంట పొలాలకు వరుణుడు కరుణించడంతో వరి పంటకు కొత్త జీవం వచ్చినట్లయింది. ఇప్పటికే నాట్లు వేసిన పొలాల్లో పంట ఏపుగా పెరుగుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో సాగు పనులు ముమ్మరమయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. వర్షాలు సకాలంలో కురవడంతో పొలాల్లో నీరు చేరుతోంది. దీంతో బోర్లు, బావులపై ఆధారపడే రైతులకు కొంత ఊరట లభిస్తోంది. చెరువులు, కుంటల్లోకి సైతం వర్షపు నీరు చేరుతుండటంతో రానున్న రోజుల్లో సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం వరి పంట ఎదుగుదలకు నీరు ఎంతో అవసరమైన దశలో వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే అధికంగా వర్షాలు కురిసి పొలాల్లో నీరు నిలిచిపోతే పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే వరి పంటకు అవసరమైన నీరు అందడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. సాగు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో పంట చేతికొచ్చే వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారు. వరుణుడి కరుణతో ఈ ఏడాది పంటలు బాగా పండాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

إرسال تعليق