భూ రీ-సర్వేకు క్షేత్రస్థాయి భూమే ప్రామాణికం : జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో నిర్వహిస్తున్న భూరి సర్వే క్షేత్రస్థాయి పరిశీలన
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భూ రీ-సర్వేలో క్షేత్రస్థాయిలో ఉన్న భూమినే ప్రామాణికంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, భూ యజమానుల సమక్షంలో రోవర్, ట్యాబ్ తదితర ఆధునిక పరికరాలతో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే ప్రక్రియను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్.. భూమి ఉండి పట్టాదారు పాస్బుక్లు లేని వారు, పాస్బుక్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి విస్తీర్ణం రికార్డులతో సరిపోని వారు, రికార్డుల్లో భూమి వివరాలు నమోదు కాని సందర్భాలను రీ-సర్వే ద్వారా గుర్తించి నిబంధనల ప్రకారం పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టాదారు పాస్బుక్లోని విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణం మధ్య తేడాలను చుట్టుపక్కల రైతుల సమక్షంలో కొలతలు నిర్వహించి నిర్ధారించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట పంచనామా నిర్వహించి, విస్తీర్ణంలో తేడాలకు కారణాలను పూర్తిగా పరిశీలించి సంబంధిత భూ యజమానికి వివరించాలని అన్నారు. రీ-సర్వే సమయంలో రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్బుక్లు, పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలించి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే నోటీసు అందించినట్లు రసీదు తీసుకోవడంతో పాటు ఫొటోలతో కూడిన పంచనామా, ఆధార్, మొబైల్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారు వివరాలను పాత రికార్డులతో సరిపోల్చి ఖచ్చితంగా నమోదు చేయాలని, ఏ ఒక్క అర్హుడి భూమి వివరాలు కూడా రీ-సర్వేలో తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మ్యాప్లు, సర్వే నంబర్లు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేసి భవిష్యత్లో భూ వివాదాలకు అవకాశం లేకుండా పక్కా రికార్డులు రూపొందించాలని అన్నారు. ఆధునిక రోవర్, ట్యాబ్ వంటి పరికరాలను సమర్థవంతంగా వినియోగించి ప్రతి భూమిని ఖచ్చితంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. అర్హులైన భూ యజమానులు, సాగుదారులకు భూ హక్కులపై స్పష్టత కల్పించేలా రీ-సర్వే పూర్తి చేసి, అర్హులకు పట్టాదారు పాస్బుక్లు అందే విధంగా రికార్డులను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. రీ-సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండి సంబంధిత పత్రాలను అధికారులకు అందజేస్తూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ వినయంధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చుండూరి సృజన, సంబంధిత అధికారులు, రైతులు, భూ యజమానులు పాల్గొన్నారు.


إرسال تعليق