సిఐటియుసి రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమల్లపల్లి మోహన్ రావు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతనాల సలహా మండలి నుంచి కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఐటీయూను తొలగించడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్‌రావు అన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతోందన్నారు. అలాంటి సంఘానికి కనీస వేతనాల సలహా మండలిలో ప్రాతినిధ్యం లేకుండా చేయడం కార్మికుల గొంతును అణచివేయడమేనని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను పక్కనపెట్టి బడా కార్పొరేట్, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తోందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు వెంటనే ప్రాతినిధ్యం కల్పించాలని, కార్మికుల కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత హక్కులను పరిరక్షించాలని కోరారు. కార్పొరేట్ అనుకూల విధానాలను విడనాడి కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని మోహన్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దోనోజు లక్ష్మయ్య, అయితగాని రవి, ఆల్ ఆటోమొబైల్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బిమగాని నాగశ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వరరావు, గుగ్గిళ్ల వీరబాబు, కోశాధికారి గర్రెపల్లి ప్రవీణ్, సహాయ కార్యదర్శి జక్కుల ప్రకాష్ యాదవ్‌తో పాటు నరేష్, వసంతబాబు, గోపీనాథ్, రాంబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق