సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
ప్రజాపక్షం/సత్తుపల్లి: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సోమవారం జీవీ మాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల కండువాలు, నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీకి నల్ల దుస్తులతో వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అని, ప్రశ్నించే గొంతుకను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష హక్కును అడ్డుకోవడం సరికాదు : సండ్ర
పార్లమెంట్లో నల్ల దుస్తులతో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అదే హక్కు ఎందుకు ఉండకూడదని సండ్ర ప్రశ్నించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తడం ప్రతిపక్ష బాధ్యత అని పేర్కొన్నారు.


إرسال تعليق