డ్రైనేజీలో పడి వృద్ధుడి మృతి.. చీకటి, వర్షం కారణంగానే ప్రమాదమా?
ప్రజాపక్షం / నేలకొండపల్లి: వినాయక మండపం వద్ద అన్నదానం కార్యక్రమానికి వెళ్లిన ఆ వృద్ధుడికి అదే చివరి భోజనంగా మారింది. భోజనం చేసి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని శంకరగిరితండాకు చెందిన తేజావత్ బాలా (60) బుధవారం రాత్రి గ్రామంలోని వినాయక మండపం వద్ద జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ భోజనం చేసిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చీకటితో పాటు వర్షం కురుస్తుండటంతో ఆయన డ్రైనేజీలో పడిన విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో బాలా విగతజీవిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాత్రివేళ డ్రైనేజీ వద్ద రక్షణ చర్యలు లేకపోవడం, చీకటి, వర్షం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. అన్నదానం కార్యక్రమానికి వెళ్లి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తున్న వృద్ధుడు ఇలా అనూహ్యంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق