కుటుంబంలో ముగ్గురి మృతి.. గ్రామంలో విషాదఛాయలు
కన్నీటి సంద్రంగా మారిన అప్పలనరసింహాపురం
ప్రజాపక్షం/నేలకొండపల్లి: కలుపు మందు విషం నుంచి బయటపడేందుకు 18 రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలుడు చివరకు కన్నుమూశాడు. తండ్రి, అక్కను ఇప్పటికే కోల్పోయిన ఆ కుటుంబంలో ఇప్పుడు కుమారుడు కూడా మృతి చెందడంతో అప్పలనరసింహాపురం గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాస్ (44) అప్పుల బాధతో గత నెల 16న తన ఇద్దరు పిల్లలకు కలుపు మందు తాగించి, అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అదే రోజు శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమార్తె లాస్య (14) మృతి చెందారు. కాగా, తీవ్ర అస్వస్థతకు గురైన కుమారుడు నిఖిల్ (11)ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. 18 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న నిఖిల్ పరిస్థితి రెండు రోజుల క్రితం విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.
ముగ్గురిని కోల్పోయిన కుటుంబం
ఒకే ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడిని కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిఖిల్ మృతితో అప్పలనరసింహాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హాజరై కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

إرسال تعليق