ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

జిల్లాలో 2.6 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యం


జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పనికి రావాలి.. గ్రామీణ ఉపాధిపై డీఆర్డీవో కొండపల్లి శ్రీరామ్

ప్రజాపక్షం /నేలకొండపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు ప్రతి కుటుంబానికి పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 2.6 కోట్ల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో వీబీజీ రాంజీ పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విలేజ్‌ మ్యాప్‌, వనరుల మ్యాప్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడారు... జిల్లాలో ప్రతి కుటుంబానికి 125 పనిదినాలు, రోజుకు రూ.308 కూలీ వేతనం అందేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కూలీలకు నిరంతరం పని లభించేలా గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.6 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి గ్రామానికి ఊటకుంట ఏర్పాటు చేయడంతో పాటు చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జి వంటి జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున జలసిరి కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో జాబ్‌కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాబ్‌కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు హాజరై ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎంపీడీవో ఎం.ఎర్రయ్య, మండల వ్యవసాయాధికారి ఎం.రాధ, మండల పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాసరావు, సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, ఈజీఎస్ ఏపీవో అమ్మజాన్, ఈసీ శేషగిరిరావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم