ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

12 గంటలు కరెంట్ ఇస్తున్నామని నిరూపిస్తారా..!



 

అప్రకటిత కోతలతో రైతుల జీవితాలతో చెలగాటం వద్దు

48 గంటల్లో ప్రభుత్వం స్పందించాలి.. లేకుంటే బీజేపీ సత్తా చూపిస్తాం: కొండపల్లి శ్రీధర్‌రెడ్డి

ప్రజాపక్షం / నేలకొండపల్లి: 12 గంటలు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అధికారులు.. అది ఏ గ్రామంలో అమలవుతుందో రైతుల సమక్షంలో నిరూపించాలని కిసాన్‌ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి సవాల్‌ చేశారు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నేలకొండపల్లిలో నిరసన చేపట్టారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు.... రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధించడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను కూడా సక్రమంగా అందించలేకపోతోందని విమర్శించారు. 12 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతున్న గ్రామాన్ని ప్రభుత్వం, అధికారులు ప్రకటించాలని.. అక్కడికి తాము వస్తామని అన్నారు. రైతుల సమక్షంలోనే విద్యుత్‌ సరఫరాపై వాస్తవ పరిస్థితులను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు స్పందించి విద్యుత్‌ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అప్రకటిత విద్యుత్‌ కోతలపై 48 గంటల్లో ప్రభుత్వం సమీక్ష నిర్వహించి, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ, అనంతు ఉపేందర్‌రెడ్డి, చావా కిరణ్‌, సంతోష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్‌, మన్నె కృష్ణారావు, మల్లేబోయిన గోవిందరావు, సూరేపల్లి జ్ఞానరత్నం, మల్లేష్‌, పురాణం దివాకర్‌, కందరబోయిన వెంకటరమణ, సూరేపల్లి అనుసూయమ్మ, పిట్టల సూరిబాబు, కొండా హర్ష తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم