కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్నాటి భాను ప్రసాద్ పిలుపు
ప్రజాపక్షం/నేలకొండపల్లి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కామ్రేడ్ కార్నాటి కృష్ణయ్య 28వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్నాటి భాను ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు నేలకొండపల్లిలోని కార్నాటి కృష్ణయ్య స్తూపం వద్ద వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్నాటి కృష్ణయ్య భూమి, భుక్తి, విముక్తి కోసం సాగించిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కర్నాటి భాను ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఐ ఎంఎల్ (మాస్‌లైన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి సురేష్ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు, కనకబండి సీతారాములు పాల్గొన్నారు.

إرسال تعليق