ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బౌద్ధక్షేత్రం భూములపై ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన



55.23 ఎకరాలు ఉండాల్సి ఉండగా.. 51.23 ఎకరాలే గుర్తింపు


మిగిలిన నాలుగు ఎకరాల భూమి ఎక్కడ? ఆక్రమణలు జరిగాయా?


జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భూముల వివరాలపై ఆరా


ప్రజాపక్షం / నేలకొండపల్లి: ప్రపంచ బౌద్ధ పటంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నేలకొండపల్లి బౌద్ధక్షేత్ర అభివృద్ధికి అడుగులు పడుతున్న వేళ.. క్షేత్రానికి చెందిన భూముల లెక్కలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమికి, క్షేత్రస్థాయిలో గుర్తించిన భూమికి మధ్య నాలుగు ఎకరాల వ్యత్యాసం ఉండటంతో అధికారులు ఆ భూముల వివరాలపై దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్ గురువారం నేలకొండపల్లి బౌద్ధక్షేత్ర పరిసర ప్రాంతాల్లో పర్యటించి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బౌద్ధక్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ.4.26 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పటికే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు రూపొందించారు. ఈ క్రమంలో అభివృద్ధి పనులకు అవసరమైన భూముల వివరాలను అధికారులు పరిశీలించారు. బౌద్ధక్షేత్రానికి మొత్తం 55.23 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 51.23 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో మిగిలిన నాలుగు ఎకరాల భూమి ఎక్కడ ఉంది? ఆ భూమి ఇతర ప్రాంతాల్లో ఉందా? ఏమైనా ఆక్రమణలకు గురైందా? ఒకవేళ ఆక్రమణలు జరిగితే ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది? అనే అంశాలపై ఆర్డీవో ఆరా తీశారు. భూములకు సంబంధించిన రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. బౌద్ధక్షేత్రానికి 55.23 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొంటూ పురావస్తు శాఖ అధికారులు మాస్టర్ ప్లాన్, మ్యాపింగ్ రూపొందించారు. ఈ నేపథ్యంలో రికార్డుల్లో ఉన్న భూముల వివరాలను, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న భూముల వివరాలను సరిపోల్చి సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. తద్వారా బౌద్ధక్షేత్ర భూముల వాస్తవ పరిస్థితి, భూముల వ్యత్యాసానికి గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిశీలనలో జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, నేలకొండపల్లి తహసీల్దార్ పి. రాంప్రసాద్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆలస్యం మధుసూదన్‌రావు, సర్వేయర్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم