తొలి సంవత్సరం నుంచే నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి: తెలంగాణ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైరాం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఇంజినీరింగ్ విద్యలోకి అడుగుపెట్టిన విద్యార్థులు తొలి సంవత్సరం నుంచే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని తెలంగాణ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైరాం సూచించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు పంచాయతీ పరిధిలోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ (SCIT)లో సోమవారం నిర్వహించిన ‘ప్రారంబ్ 2K26’ స్వాగత వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
నైపుణ్యాలతోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు
నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) జిల్లా మేనేజర్ దినేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జైరాం మాట్లాడుతూ, నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యను ప్రణాళికాబద్ధంగా అభ్యసిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత విద్య కోసం కళాశాలలకు పంపిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.
ఆధునిక సాంకేతికతపై నిరంతర అవగాహన అవసరం
కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న పరిణామాలను విద్యార్థులు ఎప్పటికప్పుడు గమనిస్తూ నూతన సాంకేతిక అంశాలపై నిరంతరం శిక్షణ పొందాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ఇంజినీరింగ్ చివరి సంవత్సరం నాటికి మెరుగైన వార్షిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. తమ కళాశాలపై నమ్మకంతో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విద్యార్థులను నైపుణ్యవంతులైన ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
ఏఐ, ఆటోమేషన్‌పై అవగాహన పెంచుకోవాలి
TASK జిల్లా మేనేజర్ దినేష్ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పులు విద్యార్థులకు అనేక అవకాశాలతో పాటు కొత్త సవాళ్లను కూడా తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులు కూడా ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో మెరుగైన కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.
లక్ష్యంతో చదివితేనే ఉన్నత శిఖరాలు
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలపతి మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యను కేవలం డిగ్రీ సాధించడానికి మాత్రమే పరిమితం చేయకుండా, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. తొలి సంవత్సరం నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర అధ్యయనాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. తరగతి గదిలో నేర్చుకునే పాఠ్యాంశాలతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. తమలోని ప్రతిభను గుర్తించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేస్తే విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, కళాశాల ప్రతిష్ఠను పెంపొందించేలా ప్రతి విద్యార్థి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నృత్యాలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
‘ప్రారంబ్ 2K26’ వేడుకల్లో నూతన విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అతిథులను, అధ్యాపకులను, తల్లిదండ్రులను అలరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. నూతన విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, వారి భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత కల్పించేలా ఈ స్వాగత వేడుకలు సాగాయి.ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ అకాడమిక్స్ డాక్టర్ సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, డిప్లొమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












కామెంట్‌ను పోస్ట్ చేయండి