ఎమ్మెల్యే అనుచరులమంటూ కొందరు దౌర్జన్యం?
30 ఏళ్లుగా టీ కొట్టు నడుపుతున్న నిరుపేద బడ్డీ కొట్టు తోలిగింపు
రోడ్డు పక్కన చిరు వ్యాపారుల బ్రతుకులను చిదిమేస్తారా? అంటూ ఆగ్రహం
ప్రజాపక్షం /వైరా: రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులపై అధికారుల చర్యలు ఇప్పుడు వైరాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తల్లాడ రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో గత సుమారు 30 సంవత్సరాలుగా టీ కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న గండుగలపాడు గ్రామానికి చెందిన ఓ చిరు వ్యాపారిపై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి.స్థానికుల కథనం ప్రకారం..సదరు వ్యాపారి రోడ్డు పక్కన ఉన్న పొలంలో చిన్నపాటి బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకుని మూడు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు తాము ఎమ్మెల్యే అనుచరులమంటూ అక్కడికి వచ్చి బడ్డీ కొట్టును తొలగించేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బడ్డీ కొట్టు సమీపంలోని వీధిలైటుకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ను కూడా తొలగించేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఇరిగేషన్ అధికారుల తీరుపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత వ్యక్తుల ఒత్తిళ్లకు అనుగుణంగా అధికారులు వ్యవహరించారని, చిరు వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడ్డీ కొట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి.బడ్డీ కొట్టును తొలగించడం, రేకులను పడేయడం వంటి చర్యలతో పాటు తమను భయభ్రాంతులకు గురిచేశారని బాధితులు వాపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.చిరు వ్యాపారి ఏర్పాటు చేసుకున్న స్థలం ప్రభుత్వ పరిధిలోనిదా, ఇరిగేషన్ శాఖకు సంబంధించినదా, లేక ప్రైవేట్ భూమా అనే విషయాన్ని అధికారులు స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. స్థలం ఆక్రమణకు సంబంధించిన సమస్య ఉంటే నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసులు ఇచ్చి, హద్దులు నిర్ధారించి చర్యలు తీసుకోవాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అధికారిక ఆదేశాలు లేకుండా ఎవరైనా వ్యక్తులు తమకు రాజకీయ పెద్దల అండ ఉందంటూ నిరుపేద చిరు వ్యాపారులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వెంబడి చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారికి కూడా జీవనోపాధి కొనసాగించుకునే హక్కు ఉందని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అనుచరులమని చెప్పుకున్నా అధికారులు వారి మాటలను మాత్రమే ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకోవడం కాకుండా, వాస్తవాలను పరిశీలించాలి. స్థలానికి హద్దులు నిర్ణయించి, నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. నిరుపేదల జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరించకూడదు” అని స్థానికులు కోరుతున్నారు


إرسال تعليق