ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట 3వ వార్డులో అంగన్వాడీ కేంద్రాలు 1, 2, 3లలో బుధవారం పోషణ మహా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 3వ వార్డు కౌన్సిలర్ సత్యవతి, సీడీపీవో కమల ప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. గుడ్లు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పాల పదార్థాలు, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలను కడిగిన తర్వాతే కోసి వండుకోవాలని సూచించారు. అన్నం వండేటప్పుడు గంజిని వార్చకుండా వినియోగించాలని, ఉప్పు, పంచదార, తెల్ల బియ్యాన్ని పరిమితంగా తీసుకోవాలని తెలిపారు. గర్భధారణ నుంచి చిన్నారి రెండేళ్ల వయస్సు వరకు ఉన్న 1000 రోజుల ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతాన్ని అర్హులైన చిన్నారులకు అందించాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో అందించే ఆరోగ్యలక్ష్మి భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. జంక్‌ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని అవగాహన కల్పించారు. అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాలతి కుమారి, మానవ హక్కుల జిల్లా అధ్యక్షురాలు తోటకూరి అంజమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, సరోజిని, సరితాబాయి, ఆయా శైలజ, ఆశా కార్యకర్తలు సుజాత, పుల్లమ్మ పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు, ఇతర తల్లులు పాల్గొని పోషకాహారంపై అవగాహన పొందారు.
నాయుడుపేటలో పోషణ మహా కార్యక్రమం
byThe News Desk
-
0

إرسال تعليق