పాత రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనతో నిజమైన హక్కుదారులకు న్యాయం
అక్టోబర్ 15లోగా ఆధారాలతో దరఖాస్తులు సమర్పించాలి: కలెక్టర్ దివాకర టీఎస్
ప్రజాపక్షం / సత్తుపల్లి: నారాయణపురం గ్రామంలోని భూ సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. పాత రెవెన్యూ రికార్డులతో పాటు ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, అర్హులైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.గురువారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో భూ రీ-సర్వే, సీలింగ్ భూముల సమస్యలపై నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. భూ రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులు, సాగులో ఉన్న విస్తీర్ణం తదితర వివరాలను గుర్తిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాత పహాణీలు, సీలింగ్ భూముల రికార్డులు, పట్టాలు, భూ బదలాయింపులు, సాదాబైనామాలకు సంబంధించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. రీ-సర్వేకు సంబంధించి అభ్యంతరాలు లేదా సందేహాలు ఉన్న రైతులు అక్టోబర్ 15లోగా సంబంధిత ఆధారాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. భూముల పరిశీలనలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా, పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్ యాదవ్, మండల ప్రత్యేక అధికారి ముజాహిద్, తహసీల్దార్ సత్యనారాయణ, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

إرسال تعليق