ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విపత్తుల నివారణపై అవగాహనతోనే సురక్షిత సమాజ నిర్మాణం: చైర్మన్



 


ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ విపత్తుల ప్రమాదాల నివారణ దినోత్సవం


 ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థినుల ర్యాలీ

 విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యక్ష ప్రదర్శన


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: విపత్తుల నివారణపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు అన్నారు. అంతర్జాతీయ విపత్తుల ప్రమాదాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎదులాపురం మున్సిపాలిటీలోని ప్రియదర్శిని మహిళ కళాశాలలో మేరా యువ భారత్–ఖమ్మం, తెలంగాణ, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యతను అలవరచుకుని ప్రజల్లో విపత్తుల నివారణపై చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బత్తుల గోపాల్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన వారికి సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ప్రతినిధి టి. వెంకటేష్ విపత్తుల సమయంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలను వివరించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించే విధానాలపై విద్యార్థినులకు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ముందస్తు అప్రమత్తత, సమయస్ఫూర్తి, రక్షణ సిబ్బంది సూచనల పాటింపు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో కీలకమని తెలిపారు. మేరా యువ భారత్–ఖమ్మం అకౌంట్స్ అధికారి కె. భాను చందర్ మాట్లాడుతూ.. యువతలో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కళాశాల అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకట రమణ మాట్లాడుతూ.. విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విద్యార్థులు ముందుండాలని అన్నారు. ఆపదమిత్ర శిక్షణ పొందిన ఎస్. భార్గవి, జి. శిరీష విద్యార్థినులకు విపత్తుల సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వారి సేవలను గుర్తించిన కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. అనంతరం నిర్వహించిన వ్యక్తిగత క్విజ్, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన అవగాహన ర్యాలీలో విద్యార్థినులు విపత్తుల నివారణ, ప్రజల భద్రత, ముందస్తు జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణపై నినాదాలతో ప్రజలకు సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శివరామకృష్ణ, యువజన సంఘ సభ్యుడు ఎం.డి. షరూక్ ఇమ్రాన్, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم