ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడులో క్షేత్ర సందర్శన.. చీడపీడల నివారణపై ప్రత్యేక సూచనలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: పత్తి సాగులో రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు పంట నాణ్యతను పెంపొందించుకునేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు రెవెన్యూ పరిధిలో మంగళవారం MCP – కపాస్ కాంతి పథకంలో భాగంగా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (KVK) శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శన నిర్వహించి పత్తి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు, పంటలో పాటించాల్సిన శాస్త్రీయ సాగు పద్ధతులు, సమగ్ర పంట యాజమాన్య విధానాలు, చీడపీడల నివారణ చర్యలపై రైతులకు వివరించారు. పంట ఎదుగుదల దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు, చీడపీడలను ముందస్తుగా గుర్తించి తగిన నివారణ పద్ధతులు పాటించడం వంటి అంశాలపై శిక్షణ అందించారు. వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించే అవకాశముందని వివరించారు. రైతులు పత్తి సాగులో ఎదురయ్యే సమస్యలపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), స్థానిక పత్తి రైతులు పాల్గొన్నారు.

إرسال تعليق