ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అలుగు కాల్వకు ముప్పు.. బఫర్‌ జోన్‌ నిబంధనలు అమలవుతున్నాయా?


 



ఇరిగేషన్‌ అధికారుల ఎన్ఓసీపై చర్చ.. క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ప్రజల డిమాండ్‌


ప్రజాపక్షం / ఖమ్మం రూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం–వరంగల్‌ బైపాస్‌ రోడ్డును ఆనుకొని భూ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు బైపాస్‌ రహదారి, మరోవైపు చెరువు నుంచి వచ్చే అలుగు కాల్వ.. వీటి మధ్య ఉన్న భూముల విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా? కాల్వ పరిరక్షణకు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అలుగు కాల్వ బ్రిడ్జికి అనుకొని ఓ వ్యాపార సముదాయానికై చేపడుతున్న పనులు ఆక్రమణ పర్వాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి.




బైపాస్‌ బ్రిడ్జి సమీపంలో ఏం జరుగుతోంది?




ఈ ప్రాంతంలో బైపాస్‌ నిర్మాణ సమయంలో బ్రిడ్జి వద్ద సుమారు 8 కాణాల మేర బ్రిడ్జి ఏర్పాటు చేసినట్లుగా స్థానికంగా పేర్కొంటున్నారు. ఈ కొలతల ప్రకారం ఆ స్థలం దాదాపు 40 అడుగుల పై వరకు ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వాస్తవంగా ఎంత స్థలం వదిలారు? దాని హద్దులు ఎక్కడివరకు ఉన్నాయి? సంబంధిత అధికారుల రికార్డులు, క్షేత్రస్థాయి కొలతల ద్వారానే స్పష్టత రావాల్సి ఉంది. ఇదే ప్రాంతానికి ఎడమవైపున ఈదుల చెరువు నుంచి వచ్చే అలుగు కాల్వ ఉన్నట్లు తెలుస్తోంది. కాల్వకు ఆనుకొని ఉన్న భూముల విషయంలో హద్దులు, నీటి ప్రవాహ మార్గం, బఫర్‌ జోన్‌ పరిమితులను స్పష్టంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న నిర్మాణాలు లేదా భూమి వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




ఎన్ఓసీ ఇచ్చినా నిబంధనలు పాటిస్తున్నారా?




సంబంధిత స్థలానికి సంబంధించి ఇరిగేషన్‌ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేసినట్లు, అందులో బఫర్‌ జోన్‌ వదలాలనే నిబంధనలు పొందుపరిచినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఆ ఎన్ఓసీలో పేర్కొన్న షరతులు ఏమిటి? స్థలానికి సంబంధించిన హద్దులు, కొలతలు ఏమిటి? అనుమతించిన పరిధిని మించి ఆక్రమణలు జరిగాయా? అన్న అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్ఓసీ జారీ చేసినంత మాత్రాన సంబంధిత నిబంధనలను పక్కన పెట్టేందుకు అవకాశం ఉండదు. అనుమతి పత్రంలో పేర్కొన్న షరతులకు అనుగుణంగా స్థల వినియోగం జరుగుతోందా లేదా అన్నది సంబంధిత శాఖ అధికారులు పరిశీలించాల్సిన అంశం. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా, కాల్వ స్థలాన్ని ఆక్రమించినా, చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.




అలుగు కాల్వకు ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిది?




చెరువుల నుంచి వచ్చే అలుగు కాల్వలు వర్షపు నీటి ప్రవాహానికి కీలకమైన మార్గాలు. ఇలాంటి కాల్వల హద్దులు క్రమంగా కుదించుకుపోతే భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే సమయంలో కాల్వల సహజ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే పరిసర ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల భూముల హక్కులు, నిర్మాణ అనుమతులు, కాల్వ హద్దులు, బఫర్‌ జోన్‌ నిబంధనలను వేర్వేరుగా కాకుండా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్థలమా? ప్రైవేటు భూమా? కాల్వకు సంబంధించిన రక్షిత ప్రాంతం ఎంత? అనుమతులు ఏ మేరకు వర్తిస్తాయి? అనే అంశాలను రికార్డుల ఆధారంగా తేల్చాలి.




ఇరిగేషన్‌ అధికారులు స్పందించాలి




ఖమ్మం–వరంగల్‌ బైపాస్‌ సమీపంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న భూ ఆక్రమణలపై ఇరిగేషన్‌ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, కాల్వ హద్దులను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్ఓసీ నిబంధనలు, బఫర్‌ జోన్‌ పరిమితులు, సంబంధిత భూ రికార్డులను పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూములు, నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలు జరగలేదని తేలితే సంబంధిత రికార్డులతో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. బైపాస్‌ పక్కన భూముల వ్యవహారంపై అధికారుల విచారణతోనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم