కంకర మిల్లు దారిలో పెద్దపులిని చూసినట్లు వెంచర్ కార్మికుల వెల్లడి.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సయ్యద్ సాదిక్ అలీ విజ్ఞప్తి
ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ ప్రాంతంలోని ఎం. వెంకటయ్యపాలెం రెవెన్యూ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వెలువడిన ఓ సమాచారం కలకలం రేపుతోంది. ఈ ప్రాంతంలోని ఓ ప్రైవేటు వెంచర్‌లో పనిచేస్తున్న కార్మికులు కంకర మిల్లు వెళ్లే దారిలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతున్నారు. దీంతో సమీప ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ సయ్యద్ సాదిక్ అలీ కోరారు . వెంచర్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెద్దపులి కనిపించినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. పెద్దపులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లకుండా, దానిని వెంబడించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అధికారులు స్పష్టత ఇచ్చే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق