వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా స్వగ్రామానికి వచ్చిన యువకుడు
కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన ద్విచక్రవాహనం
ప్రజాపక్షం/ చుంచుపల్లి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. వేపలగడ్డకు చెందిన రొంకు సత్యనారాయణ (27) హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన గురువారం రాత్రి పనిమీద కొత్తగూడెం వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరాడు.అర్ధరాత్రి విద్యానగర్ కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.చేతికందిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.

إرسال تعليق