రూ.10 కోట్ల విలువైన భూమిపై వివాదం.. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామంలో సుమారు రూ.10 కోట్ల విలువైన భూమిపై వివాదం నెలకొంది. తమ గ్రామానికి చెందిన భూమిని ఓ వ్యక్తి తనదంటూ ఫెన్సింగ్ వేసుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో ఈ వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. పొన్నెకల్లు గ్రామంలోని సర్వే నంబర్ 405లో సుమారు 5 ఎకరాల భూమి గతంలో గ్రామానికి చెందిన పెద్ద లచ్చయ్యకు ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన 1989లో తన అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన సినీ పరిశ్రమ వ్యక్తికి ఈ భూమిని విక్రయించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అనంతరం 1993లో సదరు వ్యక్తి మృతి చెందగా, ఆయన కుమారుడు 1994లో ఆ భూమిని గ్రామానికి ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి భూమి గ్రామం ఆధీనంలోనే ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తన వద్ద పట్టాదారు పాస్‌బుక్ ఉందంటూ సదరు భూమికి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. భూమి విలువ భారీగా పెరగడంతోనే ఈ వివాదం తెరపైకి వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదాన్ని నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం ఖాతాలోనే పరిహారం?
సదరు భూమి మీదుగా గతంలో ఎన్ఎస్పీ కాలువ వెళ్లిన సమయంలో చెల్లించాల్సిన నష్టపరిహారం భూ యజమానికి అందకుండా ప్రభుత్వ ఖాతాలోనే ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అనంతరం అదే భూమి పరిధిలో నుంచి జాతీయ రహదారి వెళ్లినప్పటికీ, అందుకు సంబంధించిన పరిహారం కూడా ప్రభుత్వ ఖాతాలోనే ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుమారు ఎకరంవరకు మిగిలినట్లుగా తెలిపారు . ఈ అంశాలపై రెవెన్యూ అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి
భూమిని గ్రామానికి ఇచ్చినట్లు సంబంధిత భూ యజమాని కుమారుడు గతంలో తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు భూమికి సంబంధించిన పాత రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్, పరిహారం వివరాలను పరిశీలించాలని కోరుతున్నారు. భూమి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి