పది అడుగుల భారీ బతుకమ్మతో విద్యార్థినుల సందడి.. కోలాటాలు, జానపద గేయాలతో అలరించిన వేడుకలు
ప్రజాపక్షం/వైరా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు కలిసి వివిధ రకాల రంగురంగుల పూలతో పది అడుగుల భారీ బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేశారు. బతుకమ్మపై గౌరీదేవిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పి. భూమేష్ రావు, డైరెక్టర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్ గౌరీదేవికి పూలతో అలంకరణ చేసి, నైవేద్యం సమర్పించి సంబరాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులు చప్పట్లు, కోలాటాలు, తెలంగాణ పల్లె పాటలు, జానపద గేయాలతో బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మను వైరా చెరువు వద్దకు తీసుకెళ్లి సాగనంపారు. విద్యార్థినులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పి. భూమేష్ రావు, డైరెక్టర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థినులు స్వయంగా వివిధ రకాల పూలను సేకరించి, ఎంతో ఓపికతో బతుకమ్మలను పేర్చడం అభినందనీయమన్నారు. పూలతో ఆడపిల్లలకు విడదీయరాని అనుబంధం ఉంటుందని, అందుకే బతుకమ్మ పండుగ వారిలో ప్రత్యేక ఆనందాన్ని నింపుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ
తెలంగాణ అంటేనే బతుకమ్మ అని, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనమని వారు అన్నారు. ఆశ్వయుజ మాసంలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయని వివరించారు. ప్రకృతిలో సహజంగా లభించే అడవి పూలను అమ్మవారిగా భావించి పూజించడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. ఆటపాటలతో పల్లె తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రజల సుఖసంతోషాలు, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ వేడుక పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను కూడా తెలియజేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోవడంతో పాటు దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సైతం ఘనంగా వేడుకలు జరుపుకుంటూ మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాలకు మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను అందించవచ్చన్నారు. పుస్తకాలలో చదివే బతుకమ్మ పాఠాన్ని ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులకు నేర్పించడం విద్యలో భాగమని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యాబోధన కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పి. భూమేష్ రావు, డైరెక్టర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్, ప్రిన్సిపాల్స్ షాజీ మాథ్యూ, భువన ప్రసాద్, ఏ.ఓ. నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


إرسال تعليق