సాయి ప్రభాత్ నగర్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.. కోలాటాలతో మహిళల కోలాహలం
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ శోభ సంతరించుకుంది. ఎదులాపురం మున్సిపాలిటీ ఆరో వార్డు పరిధిలోని సాయి ప్రభాత్ నగర్, సింగరేణి కాలనీ, అభయ టౌన్షిప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా శనివారం నిర్వహించారు. సాయంత్రం వేళ మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ చుట్టూ చేరి కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. “ఉయ్యాలా.. ఉయ్యాలా.. ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో” అంటూ బతుకమ్మ పాటలతో పరిసర ప్రాంతమంతా మార్మోగింది. మహిళల ఆటపాటలు, కోలాటాలతో కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా బియ్యప్పిండి, నువ్వులు, బెల్లంతో తయారుచేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి బతుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజు వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ భక్తిభావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో నిర్వహిస్తూ మహిళలు ఆనందోత్సాహాలు పంచుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబరాలు రానున్న రోజుల్లో మరింత వైభవంగా కొనసాగనున్నాయి.

إرسال تعليق