విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ
ప్రజాపక్షం/కూసుమంచి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్బో స్కూల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం బతుకమ్మ పాటలు, ఆటలు, రంగురంగుల పూల అలంకరణలతో పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పారు. ఈ వేడుకలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కుమార్తె ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ విద్యార్థులు సంప్రదాయ పాటలు పాడుతూ చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యార్థుల క్రమశిక్షణపై అభినందనలు
పాఠశాలలో విద్యార్థులు పాటిస్తున్న క్రమశిక్షణ, విద్యాబోధనతో పాటు సాధారణ ఫీజులతో విద్యను అందించే అంశాలను ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ అభినందించారు. విద్యార్థుల్లో చదువుతోపాటు క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యలో రాణించడంతో పాటు సామాజిక విలువలను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. విద్యాసంస్థల్లో ఇలాంటి పండుగ వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని, ఐకమత్యం, పరస్పర సహకారం వంటి విలువలు అలవడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పాఠశాల స్థాయిలో నిర్వహించడం విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తెలంగాణ సంప్రదాయాల పరిరక్షణలో విద్యాసంస్థల పాత్రను చాటిచెప్పింది. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ముందుగా ఈ కార్యక్రమానికి గ్లోబల్ రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ ఈర్షద్ అహ్మద్ కార్యక్రమాలకు అధ్యక్షత వహించి అతిధులను వేదికపై ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులు శ్రీనివాసరావు, కూసుమంచి ఎస్ఐ దివ్యశ్రీ ప్రముఖ జర్నలిస్ట్ లు ప్రసేన్, సాగర్, ఖదీర్, జేవియర్ కళాశాల ప్రిన్సిపాల్, కే శేఖర్ రెడ్డి పాఠశాలల ఇంచార్జ్ మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్. ఈ పాపారావు ఇంకా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం గ్లోబల్ రెయిన్బో స్కూల్స్ నుండి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ కోలాటం బతుకమ్మలతో మండల కేంద్రంలోని ఆటపాట నిర్వహించి అనంతరం ప్రధాన రహదారి మీదుగా కూసుమంచి శివాలయం రోడ్డు నుండి గంగాదేవి చెరువు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.


إرسال تعليق