ఉత్సాహంగా సాగిన తొమ్మిది రోజుల వేడుకలకు ఘనంగా ముగింపు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్య నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధి వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా సాగిన బతుకమ్మ సంబరాలకు చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పండుగ వాతావరణం నెలకొంది. కాలనీకి చెందిన మహిళలు, చిన్నారులు వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, కోలాటాలు ఆడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు అద్దం పడుతుంది. తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఈ వేడుకలు కాలనీలో ఆధ్యాత్మికతతోపాటు పండుగ శోభను నింపాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి