ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కావు!


 


అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి.. రాజకీయ వివక్షకు స్వస్తి పలకాలి


ప్రభుత్వ కార్యక్రమాలు తమ పార్టీ కార్యక్రమాలు కావనే విషయాన్ని గుర్తు ఎరగాలి


ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లలో అన్యాయంపై సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఉన్నం రంగారావు ఆగ్రహం


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కావని, ప్రజాధనంతో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఏ ఒక్క పార్టీకి గుత్తాధిపత్యం లేదని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఉన్నం రంగారావు స్పష్టం చేశారు.ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్‌లోని సీపీఐ కార్యాలయంలో ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండల సీపీఐ జిల్లా సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హతే ప్రామాణికంగా ఉండాలని, రాజకీయ అనుబంధం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం సరికాదన్నారు. పార్టీ జెండాలు మోసిన వారికే ప్రాధాన్యత ఇస్తూ, ఏళ్లుగా సొంత ఇల్లు లేక నిరుపేదలుగా జీవిస్తున్న కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఓట్లు వేస్తే ప్రభుత్వం ఏర్పడలేదని, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యతను విస్మరించకూడదని హితవు పలికారు. అధికార పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతనిస్తూ నిజమైన లబ్ధిదారులను పక్కనపెడుతున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత కార్మికుల పెన్షన్ల విషయంలో లబ్ధిదారులను నిరీక్షణకు గురిచేస్తోందని మండిపడ్డారు. పేదల జీవనాధారమైన పెన్షన్ల మంజూరులోనూ నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమన్నారు. హామీలను అమలు చేయలేని పరిస్థితి ఉంటే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సైతం అధికార పార్టీ కార్యక్రమాలుగా మార్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లకు ప్రభుత్వ కార్యక్రమాల్లో తగిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఆధిపత్య ధోరణులకు స్వస్తి పలకాలని సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, పెండింగ్ పెన్షన్లను మంజూరు చేయాలని, సంక్షేమ పథకాల అమలులో వివక్షకు తావులేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచే దశలవారీ ప్రజా ఉద్యమాలు చేపడతామని రంగారావు ప్రకటించారు. మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని, పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేడికంటి వెంకటరెడ్డి, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కరరావు, వెంపటి సురేందర్, ఎడ్లపల్లి శంకరయ్య, బూర నాగేశ్వరరావు, భానోత్ రామ్‌కోటి, పాల్తియా శ్రీను, స్థానిక కౌన్సిలర్లు దండి రంగారావు, మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది