సంప్రదాయాల సమ్మేళనంగా వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు బతుకమ్మ పండుగ ప్రతీక: ఛైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు
ప్రజాపక్షం/ఖమ్మంరూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్) ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలు, ఆటలు, రంగురంగుల పూల అందాలు, సంప్రదాయ వస్త్రధారణతో కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రదర్శించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, సంప్రదాయ నైవేద్యాలు సమర్పించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. బతుకమ్మలను తీసుకొని నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు మాట్లాడుతూ...బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ప్రకృతితో ముడిపడిన సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యత, ఆత్మీయత, సాంస్కృతిక వైభవానికి నిదర్శనమన్నారు. విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. ఇటువంటి వేడుకలు ఐక్యతా భావాన్ని, సామాజిక బాధ్యతను, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బత్తుల గోపాల్ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ ప్రకృతికి, మానవ జీవితానికి ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటిచెబుతుందని అన్నారు. ప్రకృతి అందించే వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పూలతో బతుకమ్మను పేర్చి ప్రకృతిని ఆరాధించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ఈ పండుగ తెలియజేస్తుందని వివరించారు. విద్యార్థినులు విద్యతోపాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కళాశాల అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకట రమణ మాట్లాడుతూ...పండుగలు మన సంస్కృతిని భావితరాలకు అందించే గొప్ప వారధులని పేర్కొన్నారు. బతుకమ్మ వంటి సంప్రదాయ పండుగలు విద్యార్థినుల్లో ఐకమత్యం, పరస్పర గౌరవం, సోదరభావం, సామాజిక సమైక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఆధునిక విద్యను అభ్యసిస్తూనే తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకొని భావితరాలకు అందించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తిని అభివృద్ధి చేస్తాయని తెలిపారు.విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. పాటలు, కోలాటాలు, నృత్యాలు, ర్యాలీతో కళాశాల ప్రాంగణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచింది. విద్యార్థినుల్లో సంప్రదాయాల పట్ల గౌరవం, సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఐ. నరసింహారావు, ఈసీఈ విభాగాధిపతి డి. రమేష్, హెచ్అండ్ఎస్ విభాగాధిపతి ఎన్. అనిత, ఐక్యూఏసీ ఇన్చార్జి ఎన్. జయమ్మ, బీసీఏ విభాగాధిపతి జి. హరికృష్ణ, సాంస్కృతిక కార్యక్రమాల ఇన్చార్జి ఆర్.ఎన్. ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ జి. విల్సన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

إرسال تعليق