ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

చిరునోములలో ఆగని అక్రమ ఎర్రమట్టి దందా!



అధికారులకు సమాచారం ఇచ్చినా ఆగని ట్రాక్టర్లు.. అసైన్డ్ భూముల నుంచి యథేచ్ఛగా తరలింపు


 సెలవు రోజులను ఆసరాగా చేసుకొని జోరుగా తవ్వకాలు

 మైనింగ్, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ ఏదీ?

 ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోరా?


ప్రజాపక్షం/బోనకల్: మండలంలోని చిరునోమల గ్రామంలో ఎర్రమట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం సెలవు దినాన్ని ఆసరాగా చేసుకొని జేసీబీలతో అసైన్డ్ భూముల నుంచి ఎర్రమట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మట్టి తవ్వకాలు, రవాణా కొనసాగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు గ్రామీణ రహదారులపై దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం అందించినప్పటికీ ట్రాక్టర్ల రాకపోకలు ఆగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులదే అయినప్పటికీ పర్యవేక్షణ కొరవడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు లేకుండా ఇంత పెద్ద ఎత్తున మట్టి రవాణా ఎలా కొనసాగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెలవు రోజుల్లోనే ఈ కార్యకలాపాలు మరింత జోరుగా సాగుతున్నాయని, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


అధికారులకు సమాచారం ఇచ్చినా ఆగని ట్రాక్టర్లు..


చిరునోమలలో ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని స్థానిక జీపీఓకు సమాచారం అందించగా, తాము రామాపురం భూ సర్వే పనుల్లో ఉన్నామని, తహసీల్దార్‌కు తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ మట్టి తరలింపు కొనసాగడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


అనుమతులు ఇవ్వలేదు: తహసీల్దార్


ఈ విషయంపై బోనకల్ తహసీల్దార్ చల్లూరి సుధాకర్‌ను వివరణ కోరగా, ఎర్రమట్టి రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. వెంటనే స్థానిక జీపీఓను పంపిస్తానని చెప్పారు. ట్రాక్టర్ల రవాణా కొనసాగుతున్న విషయాన్ని మరోసారి


ఆయన దృష్టికి తీసుకెళ్లగా, మట్టి తరలించే వారితో మాట్లాడానని, వెంటనే ట్రాక్టర్లను నిలిపివేస్తారని పేర్కొన్నారు. అయితే అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ మట్టి రవాణా కొనసాగడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమ తవ్వకాలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది