కౌన్సిలర్ల హక్కులకు భంగం కలిగించారంటూ ఆరోపణ
మున్సిపల్, హౌసింగ్ శాఖలపై సమగ్ర విచారణకు డిమాండ్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పీవీఆర్ గార్డెన్లో అక్టోబర్ 31వ తేదీన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న వివాదంపై ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.కు సీపీఐ ఖమ్మం రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర టిఎస్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎదులాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరుతో కౌన్సిలర్ల హక్కులకు భంగం కలిగిందని సీపీఐ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కాంగ్రెస్ నాయకులు అధికారుల వద్ద నుంచి ప్రొసీడింగ్ పత్రాలు తీసుకొని పంపిణీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎదులాపురం మున్సిపాలిటీ పర్యవేక్షణ, హౌసింగ్ శాఖ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వివాదానికి సంబంధించిన ఫొటోలు, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాల క్లిప్పింగులను ఆధారాలుగా కలెక్టర్కు సమర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పార్టీలకు, అర్హులైన ప్రజలకు సమానంగా అందాల్సి ఉండగా, ఒకే పార్టీకి చెందిన కార్యక్రమంగా వ్యవహరిస్తూ ఇతర పార్టీల నాయకులు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీఐ నాయకులు సమర్పించిన ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్, ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మిడి కంటి చిన్న వెంకటరెడ్డి, జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కరరావు, వెంపటి సురేందర్, బానోతు రామకోటి, బూర నాగేశ్వరరావు, పగిళ్ల వీరభద్రం, బట్టు బాబు, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, ఏదులాపురం మున్సిపాలిటీ 28 వార్డు కౌన్సిలర్ దండి రంగారావు పాల్గొన్నారు.
ఆధారాలతో ఫిర్యాదు..



إرسال تعليق