ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నీటి గండం పొంచి ఉన్నా.. వరి వైపే రైతుల చూపు!


 

సాగునీటి హెచ్చరికలు బేఖాతరు.. నారుమళ్లకు రైతుల సన్నాహాలు


ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి కరువు


ప్రజాపక్షం / నేలకొండపల్లి: రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తప్పదని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నా రైతుల నిర్ణయం మాత్రం మారడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగనున్నాయని, బోరుబావులపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా పెసర, మినుములు, కందులు, సజ్జలు సాగు చేయాలని సూచనలు వస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నారుమళ్ల ఏర్పాట్లు జోరందుకున్నాయి.


బోరుబావులపైనే భరోసా..


జిల్లాలో లోటు వర్షపాతం కారణంగా చెరువులు, వాగులు, కుంటలు ఆశించిన మేర నిండలేదు. యాసంగిలో సాగునీటి కొరత తీవ్రంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నా రైతులు బోరుబావుల ఆధారంగా వరి సాగుకు సిద్ధమవుతున్నారు. భూగర్భ జలాల లభ్యతపై సందేహాలు ఉన్నా దుక్కులు దున్ని నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు.


యాంత్రీకరణతో వరికే మొగ్గు..


వరి సాగులో యాంత్రీకరణ రైతులను మరింత ఆకర్షిస్తోంది. నాట్లకు కూలీలు అందుబాటులో ఉండటం, పురుగుమందుల పిచికారీకి డ్రోన్లు, కోతలకు యంత్రాలు లభిస్తుండటంతో శ్రమ తగ్గిందని రైతులు భావిస్తున్నారు. అదే ఆరుతడి పంటల్లో నిరంతరం పర్యవేక్షణ అవసరం కావడంతో వాటి వైపు ఆసక్తి చూపడం లేదు.


హెచ్‌ఎంటీ, చింట్లూ రకాలకే డిమాండ్..


మూడు నెలల్లో చేతికి వచ్చే హెచ్‌ఎంటీ, చింట్లూ రకాల వరి సాగుపైనే రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వరి కోసిన వెంటనే ధాన్యాన్ని విక్రయించుకోవచ్చనే నమ్మకం వారిలో ఉంది. మరోవైపు ఆరుతడి పంటలు సాగు చేసినా గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనన్న అనుమానంతో వెనుకడుగు వేస్తున్నారు.


అవగాహనలోనే లోటు..


పెసర, మినుములు, కందులు, సజ్జలు, శనగతో పాటు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన కనిపించడం లేదు. ఏ పంటకు ఎంత పెట్టుబడి? ఎంత లాభం? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన లేకపోవడం కూడా వరి వైపు రైతులను మళ్లిస్తోంది. అడవి జంతువులు, కోతుల బెడదతో ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లుతుందనే భయం కూడా ఉంది.


అంచనాలు ఒకలా.. క్షేత్రస్థాయి మరోలా..


గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,46,000 ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈసారి 70500 ఎకరాలకు పరిమితం కావచ్చని వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్‌లో అంచనా వేసింది. అయితే క్షేత్రస్థాయిలో రైతులు వరి సాగుకే సిద్ధమవుతుండటంతో ఈ అంచనాలు ఎంతవరకు అమలవుతాయో చూడాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم