ఎన్డీఆర్ఎఫ్ అవగాహన సదస్సులో తహశీల్దార్ వినయేందర్ రెడ్డి పిలుపు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ వినయేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని గోల్లపాడు–పోలేపల్లి ఉన్నత పాఠశాలలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ, ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... అప్రమత్తుత అనేది ఎంతో అవసరమని, దీంతో ముందస్తుగా జరగబోయే విపత్తును గమనించే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా తక్షణమే ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకునే వెసులుబాటు దక్కుతుందన్నారు .విపత్తుపై కల్పించే ట్రైనింగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ బీటెన్ సింగ్... ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల సంభవించే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశుసంపద నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముందుగా తమను తాము రక్షించుకుంటూనే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులను ఎలా కాపాడాలో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు.భూకంపాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, గాయపడిన వారికి అందించాల్సిన ప్రథమ చికిత్స, గుండెపోటు వచ్చిన వారికి అందించే సీపీఆర్ (CPR) విధానాన్ని విద్యార్థులతో ప్రాక్టికల్‌గా చేయించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి,ఆర్ఐ క్రాంతి కుమార్, గోల్లపాడు సర్పంచ్ గుండు శ్రావణి శ్రీనివాస్, పోలేపల్లి సర్పంచ్ మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సందీప్, నాగరాజు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق