ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి
పొన్నెకల్లు గ్రామంలో 22 సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటే నేరాలను సమర్థవంతంగా కట్టడి చేయవచ్చని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను గ్రామపంచాయతీ కార్యాలయంలోని మానిటరింగ్ కేంద్రం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా అనుమానాస్పద వ్యక్తులు, నేరాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు, ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించి పట్టుకునేందుకు కెమెరాల ఫుటేజీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చని ఏసీపీ పేర్కొన్నారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను శాలువతో అధికారుల సమక్షంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, గ్రామ సర్పంచ్ కోటి శ్రీనివాసరావు ఉప సర్పంచ్ పెద్ద పొంగు నరేష్, గ్రామ కార్యదర్శి తిలక్ కిషోర్, సిఐలు ముష్క రాజు, సంజీవ్ కుమార్ ఎస్సై రాయుడు, గ్రామ పెద్దలు తేలపూడి కిషన్ రావు తాటికొండ సుదర్శన్ పోరగాని వెంకయ్య ఒరగని మోహన్ రావు వెంకటరమణ రవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق