డాక్టర్ కసాకుర్తి జగదీష్ మృతి పట్ల ఖమ్మం రూరల్ ప్రజల ఆవేదన.. వాట్సాప్ గ్రూపుల్లో వెల్లువెత్తిన భావోద్వేగ సందేశాలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: “ఒక వ్యక్తిని ఇంతగా ఇష్టపడితే... అంతలా ఆరాధించాలా సార్!” అంటూ ఓ సినిమాలో వచ్చే డైలాగ్.. ప్రస్తుతం ఖమ్మం మమత హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ కసాకుర్తి జగదీష్ మృతిని చూస్తే అక్షరాలా గుర్తుకు వస్తోంది.ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డాక్టర్ జగదీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనకు సంబంధించిన వార్తను ప్రజాపక్షం వెబ్‌లో ప్రచురించగా.. ఆ వార్త లింక్ ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది.సాధారణంగా ఒక వార్తకు వచ్చే స్పందనకు భిన్నంగా.. డాక్టర్ జగదీష్ మృతి వార్తకు మాత్రం ప్రజల నుంచి ఊహించని స్థాయిలో స్పందన కనిపించింది. వార్తను పలువురు విస్తృతంగా షేర్ చేయడంతో పాటు, గ్రూపుల్లో ఆయనను గుర్తు చేసుకుంటూ సభ్యులు పెట్టిన సందేశాలు అందరినీ కదిలించాయి.మంచి వైద్యుడు మాత్రమే కాదు.. మంచి మనిషి ,ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు,చికిత్సలో ఎంతో శ్రద్ధ చూపేవారు అంటూ పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఒక వైద్యుడు అందించిన చికిత్సను రోగులు గుర్తు చేసుకోవడం సహజమే. కానీ.. ఒక వైద్యుడి మరణం తమ కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయినంత బాధను కలిగించిందని పలువురు చెప్పడం మాత్రం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. గ్రూపుల్లో వెల్లువెత్తిన సందేశాలు ఆయన వైద్య సేవలతో పాటు ఆయన మంచితనం, ఆప్యాయత, మానవత్వాన్ని కూడా గుర్తు చేశాయి. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. వైద్య వృత్తిని ఎంచుకుని.. తన చుట్టూ ఉన్న ఎంతోమందితో ఇంతటి ఆత్మీయ సంబంధాలను ఏర్పరచుకోవడం చిన్న విషయం కాదు. వృత్తి ద్వారా పరిచయమైన వ్యక్తి.. చివరికి ఆత్మీయుడిగా మారితే, ఆ అనుబంధం విలువ ఆయన లేని సమయంలోనే మరింత స్పష్టంగా తెలుస్తుంది.డాక్టర్ జగదీష్ మృతిపై సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో కనిపించిన స్పందన కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఆయనను ప్రత్యక్షంగా కలిసినవారు, చికిత్స పొందినవారు, ఆయన సేవలను పొందినవారు.. ఒక్కొక్కరు ఒక్కో జ్ఞాపకాన్ని పంచుకోవడం చూస్తే ఆయన ఎంతమంది జీవితాలను తాకారో అర్థమవుతోంది.ఒక వైద్యుడు తన వృత్తిలో ఎంత గొప్పవాడో ఆయన ఇచ్చిన చికిత్స చెబుతుంది. కానీ ఒక మనిషిగా ఎంత గొప్పవాడో.. ఆయన లేని సమయంలో ఆయనను గుర్తు చేసుకుంటూ వచ్చే కన్నీటి మాటలే చెబుతాయి.డాక్టర్ జగదీష్ మృతి ఆయన కుటుంబానికే కాదు.. ఆయన సేవలు పొందిన ఎంతోమంది రోగులకు, ఆత్మీయులకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ పలువురు పంచుకున్న సందేశాలు.. ఆయన సంపాదించింది కేవలం డబ్బు, వృత్తిపరమైన గుర్తింపు మాత్రమే కాదని.. మనుషుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం అని చెప్పకనే చెబుతున్నాయి.

إرسال تعليق