ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పాలేరు కట్టపై ప్రమాదం పొంచి ఉంది..!



 

ప్రధాన రహదారిపై భారీ గ్యాప్‌.. 30 అడుగుల లోతులో కాలువ


ఏళ్లుగా పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు.. ఎప్పుడేం జరుగుతుందోనని భయం


ఇటీవల రైతుల ర్యాలీలో తృటిలో తప్పిన ప్రమాదం


మనుషులు, పశువులు పడితే బయటపడటం కష్టమే.. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్


 ప్రజాపక్షం/కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు కట్టపై ఉన్న ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిపై ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి అశ్వారావుపేట వైపు వెళ్లే ఈ ప్రధాన రహదారిపై నిత్యం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రహదారిపై పాలేరు పాతకాల్వకు సంబంధించిన బ్రిడ్జి వద్ద ఏర్పడిన భారీ గ్యాప్‌ ప్రమాదకరంగా మారింది.


30 అడుగుల లోతు.. నాలుగున్నర అడుగుల గ్యాప్‌


పాలేరు పాతకాల్వపై నిర్మించిన బ్రిడ్జి వద్ద రహదారి మధ్య భాగంలోనే సుమారు నాలుగున్నర అడుగుల మేర ఖాళీ ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కిందకు చూస్తే దాదాపు 30 అడుగుల లోతులో కాల్వ భాగం కనిపిస్తోంది. బ్రిడ్జి పక్కనే ఉన్న ఈ ప్రమాదకర ప్రదేశం చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు పెరిగిపోవడంతో మరింత ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో లేదా వాహనాల రద్దీ సమయంలో ఈ ప్రాంతాన్ని గమనించకుండా ఎవరైనా అటువైపు వెళ్లినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశువులు, మేకలు అటువైపు వెళ్లి గ్యాప్‌లో పడితే వాటిని బయటకు తీయడం కూడా కష్టమేనని చెబుతున్నారు.


రైతుల ర్యాలీలో తృటిలో తప్పిన ప్రమాదం


ఇటీవల పాలేరు నీటి కోసం రైతులు కట్టపై ధర్నా, ర్యాలీ నిర్వహించిన సమయంలో ఈ ప్రమాదకర ప్రాంతం వద్ద కొందరు అటువైపు వెళ్లి పరిస్థితిని గమనించారని, కొంతమంది తృటిలో ప్రమాదానికి గురికాకుండా తప్పించుకున్నారని స్థానికులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఉన్న భయం మరింత పెరిగింది.


ఏళ్లుగా ఇదే పరిస్థితి.. అధికారులకు కనిపించదా?


ఈ సమస్య కొత్తగా ఏర్పడింది కాదని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రమాదకర పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నా ప్రమాదాన్ని నివారించేందుకు కనీసం తాత్కాలిక రక్షణ చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.


ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?


ప్రధాన రహదారిపై ఇంతటి ప్రమాదకర గ్యాప్‌ ఉండటం, చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, పొదలు పెరిగిపోవడం వంటి పరిస్థితులు ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఏదైనా వాహనం అదుపుతప్పినా, పాదచారి లేదా పశువు గ్యాప్‌లో పడినా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నష్టపరిహారం ప్రకటించడం కంటే ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి నివారించడమే అధికారుల బాధ్యత అని ప్రజలు పేర్కొంటున్నారు.


వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్


ప్రమాదకర ప్రాంతాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే పరిశీలించి, గ్యాప్‌ను శాశ్వతంగా పూడ్చడంతో పాటు రక్షణ గోడ/రైలింగ్‌ ఏర్పాటు చేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, బ్రిడ్జి మొత్తం పరిస్థితిపై సాంకేతిక పరిశీలన చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పట్టించుకోని ఈ ప్రమాదకర ప్రదేశంపై ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందిస్తారా? లేక ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే మేల్కొంటారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم