ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఇసుక ట్రాక్టర్ల దూకుడు.. ప్రజల ప్రాణాలకు ముప్పు!


 

అయ్యగారిపల్లిలో మహిళకు తీవ్ర గాయాలు.. వేగ నియంత్రణపై అధికారుల నిఘా ఏదీ?

అనుమతులు, రవాణా మార్గాలపై తనిఖీలు చేపట్టాలని స్థానికుల డిమాండ్


ప్రజాపక్షం/ముదిగొండ : ఇసుక తరలించే ట్రాక్టర్ల దూకుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు, నిబంధనలకు సంబంధించిన అంశాలపై స్పష్టత లేకుండానే కొన్ని వాహనాలు ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ రహదారులపై అతివేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లతో ప్రమాదాల భయం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద జరిగిన ప్రమాదం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు జ్యోతి బుధవారం తన మనవరాలిని స్కూల్ బస్సు ఎక్కించిన అనంతరం రోడ్డు దాటుతుండగా మల్కాపురం వైపు నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆమెను వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.


అడ్డూ అదుపూ లేకుండా రాకపోకలు


ఇసుక రీచ్‌ల నుంచి అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరుగుతోందన్న ఆరోపణలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం పాఠశాల సమయాల్లో ఇసుక ట్రాక్టర్లు వేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.ఇసుక రవాణా వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాటి అనుమతులు, రవాణా మార్గాలు, వాహనాల వేగం తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.


ప్రమాదం తర్వాతైనా చర్యలు ఉంటాయా?


ఒకవైపు ఇసుక రవాణాపై ఆరోపణలు.. మరోవైపు వాహనాల అతివేగం.. వెరసి ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయ్యగారిపల్లి ఘటన నేపథ్యంలోనైనా అధికారులు స్పందించి ఇసుక తరలించే వాహనాలపై కఠిన నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.అయ్యగారిపల్లి ప్రమాద ఘటనపై పోలీసులు, సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم