ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ పాలు!




ప్రారంభానికి ముందే పగుళ్లుబారిన 'ముష్టికుంట్ల' సీసీ రోడ్డు

అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

ప్రజాపక్షం/బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామంలో స్మశాన వాటిక నుంచి ఖమ్మం బోనకల్ ఆర్ అండ్ బి రోడ్డు వరకు ప్రభుత్వ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ల అక్రమాలకు, నాసిరకం పనులకు నిదర్శనంగా మారింది. రోడ్డు ప్రారంభానికి నోచుకోకముందే అడుగడుగునా నిలువునా, అడ్డంగా పగుళ్లు తేలి ఊడిపోతోంది. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చుట్టేసిన ఈ నిర్మాణం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రూల్స్ పక్కనబెట్టి.. జేబులు నింపుకొని!

రోడ్డు నిర్మాణంలో వేయాల్సిన కాంక్రీట్ మిశ్రమం, సిమెంట్ నిష్పత్తులను పూర్తిగా పక్కనబెట్టి పనులు కానిచ్చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన క్యూరింగ్ చేయకపోవడం, సరైన పునాది లేకుండానే కాంక్రీట్ వేయడంతో నిర్మాణం పూర్తయిన కొద్దిరోజులకే రోడ్డు బీటలు వారింది. ప్రజల పన్నుల సొమ్మును నాణ్యత లేని పనులతో కాంట్రాక్టర్లు స్వాహా చేస్తుంటే, పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం క్షేత్రస్థాయికి రాకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి!

ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తూ నాసిరకం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌పై, పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపించాలని ముష్టికుంట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పగుళ్లు తేలిన ఈ నాసిరకం రోడ్డును తొలగించి, పక్కా నాణ్యతా ప్రమాణాలతో కొత్త రోడ్డును నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم